మే 20 అనగా ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ అని నిరూపించుకున్న పలువురు వ్యక్తుల పుట్టిన రోజు. ఈ రోజు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, హీరో మనోజ్ లతో పాటు అందరూ ఎంతగానో గౌరవించే లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పుట్టిన రోజు కూడా ఈ రోజే కావడం విశేషం.
ఎన్.టి.ఆర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన ఎన్.టి.ఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఎన్.టి.ఆర్ నందమూరి హరికృష్ణ – శ్రీమతి షాలిని దంపతులకు 1983 మే 20వ తేదీన హైదరాబాద్లో జన్మించాడు. సీనియర్ ఎన్.టి.ఆర్ లానే వాక్ చాతుర్యం, టాలెంట్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ నందమూరి వంశం నుండి మూడవ తరం నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సంవత్సరం ‘బాద్షా’ తో సక్సెస్ అందుకున్న ఎన్.టి.ఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొత్త సబ్జెక్ట్స్ తో, కొత్త కొత్త టెక్నీషియన్స్ తో ప్రయోగాలు చేసి మంచు మనోజ్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డా మోహన్ బాబు – శ్రీమతి నిర్మల దేవి దంపతులకు 1983 మే 20వ తేదీన మనోజ్ జన్మించాడు. మనోజ్ 10 సంవత్సరాల వయసులోనే కెమెరా ముందుకు వచ్చి తెరపై కనిపించాడు. మనోజ్ లో తన నాన్న గారిలానే మంచి కామెడీ టైమింగ్ ఉంది. మనోజ్ ప్రస్తుతం ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
తెలుగులో లిరిసిస్ట్ గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అందరికీ తెలిసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రశ్నలను పాటలుగా మలచడంలో, అలాగే ఆవేశపూరితమైన, ఉత్తేజితుల్ని చేసే పాటలను రాయడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేక పేరుంది. ఉదాహరణకి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలోని ‘జరుగుతున్నది జగన్నాటకం’ పాటని తీసుకోవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న సిరివెన్నెల గారు 1955 మే 20వ తేదీన జన్మించారు.
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మంచు మనోజ్, శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లకు 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.