యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కి ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ, కొరటాల శివ, వంశీ, ప్రమోద్, దిల్ రాజు, రామజోగయ్య శాస్త్రి, ఎ.ఎస్ ప్రకాష్ హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ సినిమా మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నైజాంలో కలెక్షన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. నేను తీసిన ఆర్య సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ గా వంశీ – ప్రమోద్ ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు వారు తీసిన సినిమాని నేను డిస్ట్రిబ్యూట్ చేసానని’ అన్నాడు.
కొరటాల శివ తనకి అవకాశమిచ్చిన ప్రభాస్, నిర్మాతలకి ధన్యవాదాలు చెబుతూ ‘ ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో తో మొదటి సినిమా చేస్తున్నామంటే ఒక పెద్ద డైరెక్టర్ అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ ప్రభాస్, నిర్మాతలు ఇద్దరూ ముందు స్క్రిప్ట్ బాగుండాలి అని అడిగారు. ఈ సినిమా విషయంలో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని’ అన్నాడు.
కొరటాల శివ డైరెక్షన్ స్టైల్ గురించి ప్రభాస్ చెబుతూ ‘ కొరటాల శివ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్. తను ప్రతి సబ్జెక్ట్ ని బాగా డీల్ చెయ్యగలడు. ఈ సినిమాలో ‘ఇదేదో బాగుండే సాంగ్’ కి ముందు అనుష్క వేరెవరితోనే క్లోస్ గా ఉంటే చూసి అసూయ పడే సీన్ నాకు చాలా ఇష్టం. ఒకవేళ కొరటాల శివ రొమాంటిక్ ఎంటర్టైనర్ తీయాలనుకుంటే నన్ను హీరోగా తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిచా గంగోపాధ్యాయ రోల్ బాగుంది, ఒక కుటుంబంలో అణచి వేసిన అమ్మాయి పాత్రలో చేయడం అంత సులువు కాదు కానీ రిచా బాగా చేసింది. అనుష్కతో మరోసారి కలిసి పనిచేయడం ఆనదంగా ఉంది, ఆమె సెట్స్ లోకి వస్తే అందరితో కలిసిపోతారు. వంశీ ప్రమోద్ ఈ సినిమా కోసం బాగా ఖర్చు చేసారు, కానీ వాళ్ళు సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో అంత ఖర్చు పెట్టారు. ఈ సినిమాతో వాళ్లకి మంచి పేరు రావడమే కాకుండా, భవిషత్తులో మరికొన్ని మంచి సినిమాలు తీసి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారు. ఆలాగే సినిమాకోసం పని చేసిన దేవీ శ్రీ ప్రసాద్, మదీ, చంటి,ఎ.ఎస్ ప్రకాష్, రామజోగయ్య శాస్త్రి , భాస్కర్ కి నా ధన్యవాదాలు తెలిపారు’.