గత కొద్ది రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి థియేటర్లు దొరకడం లేదని కొంత మంది బడా నిర్మాతలు థియేటర్లను తమ ఆధీనంలో ఉంచుకున్నారని నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన ‘జీనియస్’ సినిమా 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘ అన్నం తింటున్నవాడి ముందు పళ్ళెం లాగేస్తే వాడు ఎంత బాధ పడతాడో అంతే భాదని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేను కాబట్టి తట్టుకున్నాను వేరే వారయితే ఉరేసుకునేవారు. నా సినిమా విడుదలై 25 రోజులైనా ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. థియేటర్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఒక నిర్ణయాన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నానని’ అన్నాడు. ఈ కార్యక్రమంలో ఓంకార్ మాట్లాడుతూ ‘ మంచి కలెక్షన్లు వస్తున్న ఈ సినిమాని రెండు పెద్ద సినిమాల కోసం థియేటర్లలో తీసెయ్యడం న్యాయం కాదని’ అన్నాడు.