సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోచాడియన్’. ఈ చిత్రాన్ని ‘విక్రమసింహ’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ చిత్ర వర్గాలు మాట్లాడుతూ ‘ ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ మరియు ఆంగ్ల బాషలలో ఒకే సారి విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ తరహాలో అత్యాధునిక సాంకేతిక విలువలతో 3డిలో రూపొందిస్తున్నాం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర ఆడియోని జపాన్ రాజధాని టోక్యోలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేయాలనుకుంటున్నాము. కార్బన్ సంస్థతో కలిసి ఈ చిత్ర ప్రచారాన్ని వినూత్నంగా చేయనున్నామని ఇదివరకే తెలిపాము. ఈ చిత్రానికి సంభందించిన తెలుగు హక్కులను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు’ అని తెలిపారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది, శరత్ కుమార్, శోభన మరియు జాకీ ష్రాఫ్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ మరియు మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.