తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. కీరవాణి గారు 1961వ సంవత్సరంలో జూలై 4వ తేదీన జన్మించారు. 1987వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా కీరవాణి కెరీర్ని మొదలుపెట్టారు. 1990లో విడుదలైన ‘మనసు మమత’ చిత్రం ద్వారా ఈయన సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంతో కీరవాణి కథను అర్థం చేసుకొని సన్నివేశానికి తగ్గ విధంగా నేపధ్య సంగీతం చేస్తాడని తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటుచేసుకున్నారు. కీరవాణి గారు తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
కీరవాణి గారు ఎం.ఎం క్రీమ్ అనే పేరుతో బాలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు, అలాగే మరగత మణి అనే పేరుతో కోలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకూ కీరవాణి గారు విభిన్న భాషల్లో 200 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకుల్ని అలరించారు. 1998లో విడుదలైన ‘అన్నమయ్య’ చిత్రానికి కీరవాణి నేషనల్ అవార్డు అందుకున్నారు, అలాగే ఇప్పటివరకూ ఈయన 8 నంది అవార్డులు గెలుచుకున్నారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న ఎం.ఎం కీరవాణి గారికి 123తెలుగు.కామ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.