తెలుగు సినిమా ప్రస్తుత యువ హీరోలలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ రామ్ పోతినేని హీరోగా టాలెంటెడ్ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ తెరకెక్కించిన తాజా చిత్రమే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మొదటిగా ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా కన్నడలో కూడా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఇక్కడే తెలుగు, కన్నడ రెండు భాషలకి సంబంధించి చిన్నపాటి వివక్ష కనిపిస్తుంది. కన్నడ పోస్టర్ లో సినిమా టైటిల్ మొత్తాన్నీ కన్నడ అక్షరాలతోనే రూపొందించారు. కానీ మన తెలుగు పోస్టర్స్ లో ఇప్పటివరకు ఇలాంటిది ఒక్కటి కూడా రాలేదు.
కేవలం తాలూకా అనే పదం మాత్రమే తెలుగులో ఉంటుంది. కన్నడ వెర్షన్ లో కూడా తాలూకా అనే పదం వరకే వారి అక్షరాల్లో పొందు పరచవచ్చు కదా? ఇది వరకే కన్నడలో విడుదల చేసిన అనేక సినిమాలు ఈ టైటిల్స్ విషయంలోనే వారి సెగని ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ అదేంటో మన తెలుగు నుంచే వెళుతున్న సినిమాలు అక్కడి భాషని గౌరవిస్తూ మార్చి వెళ్తాయి కానీ మన దగ్గర మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటాయి. మరి ఈ సమీకరణాలు ఏంటో తెలుగు భాషా ప్రియులకి అర్ధం కావు. ఈ రెండు పోస్టర్స్ చూస్తే ఎందుకీ చిన్నపాటి వివక్ష అనే మాట సోషల్ మీడియాలో కూడా మొదలు కాకుండా ఉండదు.
