పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన చిత్రమే ‘ఓజీ’. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘ఓజీ కాన్సర్ట్’ పేరుతో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సుజీత్ నాకు వీరాభిమాని. ‘సాహో’ తర్వాత త్రివిక్రమ్ నాకు తనని పరిచయం చేశాడు. అతను కథ చెప్పే తీరు క్లుప్తంగా ఉన్నా.. దాన్ని తెరకెక్కించేటప్పుడు తనలోని సత్తా తెలుస్తుంది’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర విషయంలో ఎక్కువ క్రెడిట్ సుజిత్ కే దక్కుతుంది. అలాగే తన విజన్‌ను అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ సినిమాకి వీళ్లిద్దరే స్టార్లు. వీళ్లిద్దరూ సినిమా అంతా ఒక ట్రాన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత అందులోకి నన్నూ లాగేశారు. నేనొక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయేంతలా దీంట్లో నన్ను లీనమయ్యేలా చేశారు. ఈ సినిమాలో నాకు.. ప్రియాంకకు మధ్య నడిచే ప్రేమకథ చిన్నదే అయినప్పటికీ అది చాలా హృద్యంగా ఉంటుంది. ఇక సుజీత్ లాంటి యువ దర్శక బృందం నేను దర్శకత్వం చేసిన రోజుల్లో ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో’’ అని పవన్ కామెంట్స్ చేయడం విశేషం. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాని నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక.