‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2′. నిన్న రాత్రి హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హృతిక్ మాటల్లోనే.. ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ‘వార్’, ‘క్రిష్’, ‘ధూమ్2’ ఇలా నేను నటించిన ప్రతి సినిమాను ఆదరించారు. ‘వార్2’ కూడా మీకు మరింత వినోదాన్ని పంచుతుంది. మేము చాలా కష్టపడి చేశాం’ అని హృతిక్ తెలిపాడు.
హృతిక్ ఇంకా మాట్లాడుతూ.. ‘వార్ 2 సినిమా సెట్స్ లో మేం చాలా సార్లు గాయపడ్డాం. నేను బాధతో విలవిలలాడుతుంటే, ఎన్టీఆర్ మాత్రం ఆ బాధను పంటి బిగువున పెట్టుకుని సీన్స్ చేశారు. అది నాకెంతో స్ఫూర్తిగా అనిపించింది. తారక్‌లో నన్ను నేను చూసుకున్నా. ఎన్టీఆర్ గురించి ఒక్క మాట చెప్పాలంటే, ‘సింగిల్ టేక్ స్టార్’. ఏదైనా షాట్ పెడితే, 99.99శాతం కాదు, 100శాతం ఎలా నటించాలో ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నా. నా తర్వాతి సినిమాల్లో అవన్నీ పాటిస్తా. నటుడికన్నా కూడా ఎన్టీఆర్‌లో గొప్ప చెఫ్ ఉన్నాడు. ఈసారి ఆయన చేతి బిర్యానీ తినాలి’ అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.