ఈ మధ్య కాలంలో సరిగ్గా సినిమాలు పెద్దగా రావడం లేదనే కంప్లైంట్స్ మూవీ లవర్స్ లో ఉన్నాయి. జూలైలో ఒక్క హరిహర వీరమల్లు నోటెడ్ గా కనిపించింది. దాని తర్వాత కింగ్డమ్. ఇక నెక్స్ట్ ఆగస్ట్ ఇపుడు రానే వచ్చింది. ఈ రావడంతోనే నెలాఖరు వరకు పాన్ ఇండియా లెవెల్లో మంచి స్టార్ కాస్ట్ తో కూడిన సినిమాలే లైన్ లో వేచి ఉన్నాయి. వీటితో పాటుగా పలు రీరిలీజ్ లు కూడా అవన్నీ ఏంటో డేట్స్ వారీగా చూద్దాం.
సర్ మేడమ్ – ఆగస్టు 1
మక్కల్ విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మెయిన్ లీడ్ లో నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’ గత వారమే తమిళ్ లో విడుదల అయ్యింది. తెలుగులో కూడా అప్పుడే విడుదల కావాల్సి ఉంది కానీ ఆగింది. ఇప్పుడు తెలుగులో ‘సర్ మేడమ్’ గా విడుదల అయ్యింది.
సన్ ఆఫ్ సర్దార్ 2 – ఆగస్టు 1
బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ మన తెలుగు సూపర్ హిట్ మర్యాద రామన్నకు రీమేక్ గా చేసిన సన్నాఫ్ సర్దార్ కి సీక్వెల్ ఇది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో హిందీలో విడుదల అయ్యింది.
ధడక్ 2 – ఆగస్టు 1
‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తో పాటు విడుదల అవుతున్న ఈ యువ ప్రేమకథ, తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’ కు హిందీ రీమేక్. అనిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి, అలాగే యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది నటించిన ఈ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు.
బకాసుర రెస్టారెంట్ – ఆగస్టు 8
నటుడు ప్రవీణ్ హీరోగా మారి చేసిన ఈ ఫుడ్ జానర్ సినిమా బకాసుర రెస్టారెంట్ ఆగస్ట్ 8న విడుదల కాబోతుంది.
అతడు – రీరిలీజ్ – ఆగస్టు 9
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా మేకర్స్ ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ లలో మహేష్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇది మరిన్ని రికార్డులు సాధిస్తుంది అని అభిమానులు నమ్ముతున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.
కూలీ – ఆగస్టు 14
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’తో వస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ నటులతో వస్తున్న ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ముందే విడుదల కాబోతుంది.
వార్ 2 – ఆగస్టు 14
ఇక ఇదే డేట్ లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కియారా అద్వానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లతో అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం వార్ 2. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆరోజే బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేయనుంది.
పరదా – ఆగస్టు 22
ఇది ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా, ప్రదీప్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించగా, దర్శనా రాజేంద్రన్, సంగీత సహాయక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మంచి ప్రమోషన్స్ ఈ సినిమా చేసుకుంటుంది.
స్టాలిన్ రీరిలీజ్ – ఆగస్టు 22
మెగాస్టార్ చిరంజీవి నటించిన పవర్ఫుల్ మెసేజ్ యాక్షన్ డ్రామా ఈ స్టాలిన్. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే కాగా మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ కి రాబోతుంది. దీనిపై మంచి బజ్ ఉంది.
సుందరకాండ – ఆగస్టు 27
ఈ ఫీల్-గుడ్ తెలుగు డ్రామాలో నారా రోహిత్ నటించగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. భావోద్వేగంగా కథనాన్ని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
హృదయపూర్వం – ఆగస్టు 28
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నుంచి ఈ ఏడాదిలో వస్తున్న మూడో సినిమానే ‘హృదయపూర్వం’. దీనికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. ఇది మోహన్ లాల్ కి హ్యాట్రిక్ గా నిలుస్తుందో లేదో చూడాలి.
రివాల్వర్ రీటా – ఆగస్టు 29
స్టార్ నటి కీర్తి సురేష్ నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమానే ఈ ‘రివాల్వర్ రీటా’ ఎప్పుడో తెరకెక్కించిన ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఆగస్టు ఆఖరుకి లాక్ అయ్యింది.
పరం సుందరి – ఆగస్టు 29
దేవర బ్యూటీ జాన్వీ కపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కలయికలో తుషార్ జలోటా దర్శకత్వం వహించిన సినిమానే పరం సుందరి.. బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇలా ఆగస్టు ఒకటో తారీఖు నుంచే ప్రతీ వారం మినిమమ్ ఒక్క నోటెడ్ సినిమా అయినా ఆడియెన్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉంది. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.