దశాబ్ద కాలం పాటు తెలుగు ప్రేక్షకులను కమెడియన్ గా బాగా నవ్వించిన సునీల్ గత కొంతకాలంగా సోలో హీరోగా సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్నాడు. సునీల్ – నాగ చైతన్య కలిసి చేసిన ‘తడాఖా’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సునీల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు.
ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడంటే హీరోగా సక్సెస్ లు ఉన్నాయి, సక్సెస్ లు రాకపోతే మొదటికే మోసం వస్తుందేమో అని అడిగితే సునీల్ సమాధానమిస్తూ ‘ చెప్పాలంటే ‘మర్యాద రామన్న’ తర్వాత కమెడియన్ గా చేద్దామనుకుంటుంటే అనుకోకుండా వర్మ గారి దగ్గరి నుండి అవకాశం రావడంతో ఆలోచించకుండా ఓకే చేశాను. అది ఫ్లాప్ అయ్యింది. ఒక ఫ్లాప్ తో హీరోగా పుల్ స్టాప్ పెట్టాలనుకోలేదు అందుకే ‘పూల రంగడు’ చేశా హిట్ అయ్యింది ఆ తర్వాత హీరోగా ఆపేద్దామనుకున్నా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దాంతో తప్పక హీరోగా చేస్తున్నాను. నేను స్వతహాగా కమెడియన్, ఒకవేళ హీరోగా అవకాశాలు రాకపోతే లేదంటే నా కమెడియన్ పోస్ట్ నాకు ఎలాగో ఉందిగా. చివరిగా ఒక్కటి ఇండియానే గర్వించదగ్గ అమితాబ్ బచ్చన్ గారే ప్రస్తుతం స్పెషల్ రోల్స్ చేస్తున్నారు, ఆయనతో పోల్చుకుంటే నేనెంత అని’ అన్నాడు.