జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య నిర్మించిన చిత్రం ‘పొన్మగల్ వంధాల్’. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య భావించారు.అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఐతే సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియో సందేశం కూడా పంపడం జరిగింది.
సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన ‘పొన్మగల్ వంధాల్’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం. ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వమని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వలన థియేటర్స్ మనుగడకు ముప్పు వస్తున్న తరుణంలో వారు ఈ విధంగా స్పందించారు.