‘అల వైకుంఠపురములో’ చిత్రంతో క్లాస్ ట్రీట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈసారి నూటికి నూరు శాతం మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న చిత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని, ప్రధానంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే టార్గెట్ అని తెలుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మొత్తం ముగ్గురు ప్రతినాయకులు ఉండనున్నారు. వారే విజయ్ సేతుపతి, జగపతిబాబు, రాజ్ దీపక్ శెట్టి.
ఈ ముగ్గురి పాత్రలు కథలో చాలా టఫ్ అని, వీరికి, అల్లు అర్జున్‌కి మధ్యన పోరు రసవత్తరంగా ఉంటుందని, ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు స్క్రీన్ ప్లే మూడు కోణాల్లో నడుస్తుందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ పూర్తిగా గడ్డం పెంచి లుక్ మార్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.