ఈగ హిందీ శాటిలైట్ రైట్స్ కోసం భారీ క్రేజ్ : రాజమౌళి


ఈగ సినిమా ముందు వరకు స్టార్ దర్శకుడిగా ఉన్న రాజమౌళి ఆ సినిమా విడుదల తరువాత సూపర్ స్టార్ దర్శకుడిగా మారిపోయారు. స్టార్ హీరో లేకుండా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరో సినిమా రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తున్న ఈగ సక్సెస్ విషయాలను ప్రముఖ రేడియో స్టేషన్ రేడియో మిర్చిలో పంచుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ “ఈగ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళని చూడమని చెబుతున్నారు. మౌత్ టాక్ మించిన పబ్లిసిటీ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద స్టార్ హీరో రేంజ్ సినిమాకి వచ్చినంత ఓపెనింగ్స్ ఈగ వచ్చాయి. “నాన్ ఈ” పూర్తిగా తమిళ్ సినిమా అది డబ్ సినిమా కాదు. మొదటి నుండి ‘ఈగ’కి ఎంత కష్టపడ్డామో ‘నాన్ ఈ’కి కూడా అంతే కష్టపడ్డాము. అందుకే తగ్గ ప్రతిఫలమే దక్కింది. కన్నడలో గొప్పగా కాకపోయినా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

విడుదలకి ముందు రోజు హిందీకి సంభందించిన శాటిలైట్ రైట్స్ కోసం 5 కోట్ల వరకు అడిగారు. ప్రస్తుతం ఇంకా ఎక్కువ స్థాయిలో ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. కాని మా నిర్మాతలు అంగీకరించలేదు. హిందీ వెర్షన్ 3డి లో విడుదల చేయాలా వద్ద అనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి హిందీలో డిసెంబర్లో విడుదల చేస్తాం. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టాప్ డైరెక్టర్ శంకర్ గారు కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఆయన సినిమాలో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి కాకుండా ఎమోషనల్ సీన్స్ గురించి మాట్లాడారు. ఈ సినిమాని ఇక్కడితో ఆపొద్దు హిందీ వరకు తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అంటూ తెలిపారు.

Exit mobile version