వాయిదా పడ్డ ‘జులాయి’


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అభిమానులు వీరి ముగ్గురి కాంభినేషన్లో రాబోతున్న “జులాయి” చిత్రం కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే జూలై 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ చిత్ర నిర్మాత ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారో అనేది రేపు చెప్పే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అనుకున్న తేదీకే విడుదల చేయాలనే భావనతోనే ఉన్నారు, కానీ ఈ చిత్రం ఇప్పటివరకూ సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోలేదు మరియు స్పెషల్ గా బన్నీ మరియు దేవీలపై తీసిన ప్రోమో సాంగ్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ కారణాల వల్ల నిర్మాత చిత్రాన్ని ప్రోమోట్ చేయడానికి కొంత సమయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారని సమాచారం.

ఎస్.ఎస్ రాజమౌళి తీసిన ‘ఈగ’ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంకి ఉన్న క్రేజ్ వల్ల ‘జులాయి’ ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గిపోతాయనే ఉద్దేశంతో నిర్మాత ఈ చిత్రాన్ని వాయిదా వేశారని సినీ పరిశ్రమలో రూమర్స్ వినిపిస్తున్నాయి.రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంభినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Exit mobile version