ఎటో వెళ్లిపోయింది మనసు ట్రైలర్ కి భారీ స్పందన


నాని , సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” ట్రైలర్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. రెండు రోజుల క్రితం సోనీ మ్యూజిక్ అధికారిక పేజిలో పోస్ట్ చేసిన ఈ ట్రైలర్ ని ఇప్పటికి లక్ష మందకి పైగా వీక్షించారు. రెండు రోజుల్లో లక్షమంది వీక్షించడం అంటే చాలా గొప్ప విషయం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చిత్ర ప్రమోషన్ భాగం అంతా ఎక్కువగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ మీదనే జరుగుతుండటం. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 1న చెన్నైలో తమిళ వెర్షన్ తో పాటు విడుదల అయ్యింది. గతంలో ఈ చిత్ర ఆడియోని హైదరాబాద్లో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ జరిపి విడుదల చెయ్యాలని అనుకున్నారు కాని కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడింది. అక్టోబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి మరో రెండువారాల్లో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ మధ్యనే చెన్నైలో ముగిసిన చివరి షెడ్యూల్ లో నాని మరియు సమంత మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసేశారు. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో సి కళ్యాణ్, తేజ సినిమా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించగా ఎం ఎస్ ప్రభు మరియు ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version