చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న హీరో నాని. ఇటీవలే నాని – సమంత జంటగా నటించిన ‘ఈగ’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో నానికి ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. ప్రస్తుతం మళ్ళీ నాని మరియు సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. ఎంతో సున్నితమైన ప్రేమకథా చిత్రాలు తీసే గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలియజేశారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర రెండు టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ టీజర్లలో వదిలిన మ్యూజిక్ బిట్స్ సూపర్బ్ గా ఉండడం మరియు మొదటి సారి గౌతమ్ మీనన్ మరియు ఇళయరాజా కలిసి పనిచేస్తున్నందువల్ల ఈ చిత్ర ఆడియో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది.