ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌కు ముందు ఓవల్ స్టేడియంలో టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు గ్రౌండ్స్‌మన్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే, ప్రాక్టీస్ సమయంలో గంభీర్ తన సహాయక సిబ్బందితో కలిసి కూలింగ్ బాక్స్ తీసుకెళ్తుండగా, ఫోర్టిస్ అక్కడికి వచ్చి వారిని ఆపాడు. ‘‘మీరు పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలి’’ అని చెప్పాడు. దీనిపై గంభీర్ ఆగ్రహంతో స్పందిస్తూ, ‘‘మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఏం చేయాలో మాకు తెలుసు’’ అంటూ ఫోర్టిస్‌ను మందలించాడు. అంతేకాదు, ‘‘ఇక్కడి సిబ్బంది మాత్రమే నువ్వు, మాకు సూచనలు చేయొద్దు’’ అంటూ గంభీర్ ఘాటుగా చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీనికి ఫోర్టిస్ కూడా స్పందిస్తూ, ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
ఈ ఘటనపై టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘మేము కేవలం కూలింగ్ బాక్స్ తీసుకెళ్తున్నాం, అది చాలా తేలిక. మేము పిచ్ దగ్గరికి వెళ్లినా, ఎవరూ స్పైక్స్ కూడా వేసుకోలేదు. క్యూరేటర్లు తమ పిచ్‌పై జాగ్రత్తగా ఉంటారు, కానీ అహంకారంగా ప్రవర్తించకూడదు. మేము ఏ తప్పూ చేయలేదు’’ అని వివరించారు.
ఇటీవలే మాంచెస్టర్ టెస్ట్‌లో కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్–భారత బ్యాటర్ల మధ్య చిన్న వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓవల్‌లో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.