ఆ రేట్లు పెరిగితే ఎందుకు మాట్లాడరు – శివాజీ

ఆ రేట్లు పెరిగితే ఎందుకు మాట్లాడరు – శివాజీ

Published on Nov 24, 2025 4:13 PM IST

హీరో శివాజీ ‘కోర్టు’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. పైగా ఆయన చేసిన మంగపతి పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఐతే, సామాజిక అంశాలపై, ప్రజల సమస్యలపై స్పందించడంలో శివాజీ ముందుంటారు. తాజాగా ఆయన ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంపై, అలాగే టికెట్ ధరలు, థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐబొమ్మ రవి అరెస్టుపై శివాజీ మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ రవి మంచి టాలెంటెడ్. అతని ప్రతిభను నేను 200 శాతం అభినందిస్తాను. కానీ, దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే శిక్షకు గురికావాలి’ అని శివాజీ చెప్పుకొచ్చారు.

అలాగే, టికెట్ రేట్ల వివాదం పై కూడా శివాజీ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఇక్కడ అందరికి లగ్జరీ లైఫ్ ఉండదు. ఇక టికెట్ రేట్లు పెరిగాయి అంటున్నారు. మరి సంక్రాంతి సమయంలో బస్సు రేట్లు మూడు రెట్లు పెరిగినా ఎందుకు ఎవరూ మాట్లాడరు ?. కానీ సినిమా టిక్కెట్ రూ.100 పెంచితే మాత్రం ఇండస్ట్రీనే విలన్‌గా చూపిస్తారు, ఇది కరెక్ట్ కాదు’ అంటూ శివాజీ తన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు