తమిళ రాజకీయాలకు అక్కడి సినిమా పరిశ్రమకు ఎప్పుడూ ఒక లింక్ నడుస్తూనే ఉంటుంది. స్టార్ హీరోలు పొలిటికల్ పార్టీ పెట్టనున్నారని తరచు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయాల్లో ఉండగా రజినీకాంత్ ఎంట్రీ పై సందిగ్ధత కొనసాగుతుండగా తాజాగా ఇలయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద పెద్ద చర్చే నడుస్తోంది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’ పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించారు. దీంతో విజయ్ మీద కూడ రూమర్లు మొదలయ్యాయి.
ఆయన తండ్రి పార్టీనే ఆయన పేరుతో రిజిస్టర్ అయినట్టు ప్రచారం మొదలైంది. దీంతో విజయ్ అభిమాన సంఘాల్లో గందరగోళం మొదలైంది. ఈ వార్తలపై విజయ్ స్పందించారు. తాను ఎలాంటి పొలిటికల్ పార్టీని స్థాపించలేదని, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పార్టీని పెట్టారని, దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ కార్యకలాపాల్లో తన పాత్ర, తన అభిమాన సంఘాల పాత్ర ఉండదని అన్నారు. అలాగే పార్టీ తన తండ్రిది కాబట్టి అభికమానులను వెళ్లి అందులో చేరమని తాను చెప్పనని, ఇకవేళ తన పేరును, ఫొటోలను రాజకీయాల్లో దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించనని స్పష్టం చేశారు.