బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటన, అభినయం కలగలిగిన పాత్రలు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది. ఇటీవలే కహాని సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న ఆమె డర్టీ పిక్చర్ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచి అవార్డులు సైతం కొల్లగొట్టింది. ఇష్కియా, పా లాంటి విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ వస్తున్న విద్యా ఇటీవలే వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందేమో అనుకుంటుండగా ఒక సినిమా అంగీకరించింది. ప్రముఖ కర్నాటిక్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమాలో విద్యా బాలన్ టైటిల్ రోల్ పోషించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది.