‘వర్షం’ సినిమాతో కథా రచయితగా ఇండస్ట్రీకి పరిచయమై ‘బిందాస్’ మరియు ‘రగడ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరూ పోట్ల అక్కినేని నాగ చైతన్య హీరోగా ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో నాగ చైతన్య కామెడీకి ప్రాధాన్యం ఉన్న పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. నాగార్జునకి సన్నిహితుడైన డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్త్రుతం శివ ప్రసాద్ రెడ్డి నాగార్జునతో ‘లవ్ స్టొరీ’ సినిమాని నిర్మిస్తున్నారు.
వీరూ పోట్ల కామెడీని బాగా చూపించగలడని తను తీసిన ‘బిందాస్’ చిత్రంతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య ఒక కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఎంచుకోవడం ఒక ట్రిక్ అనే చెప్పుకోవాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం కోసం ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ కథానాయికతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలోనే మీకందజేస్తాము.