2025 ఆగస్టు 5న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన మేఘవిస్ఫోటనం (క్లౌడ్‌బర్స్ట్) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో వచ్చిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ధరాలి గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రకృతి విపత్తులో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గల్లంతయ్యారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని లేదా వరదల్లో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విపత్తు తీవ్రత
మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఖీర్ గంగా నది ఎగువ ప్రాంతంలో క్లౌడ్‌బర్స్ట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ధరాలి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ గ్రామం గంగోత్రి దామ్‌కు 4 కిలోమీటర్ల దూరంలో, హర్సిల్ సమీపంలో ఉంది. వరద ఉధృతికి ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. స్థానికులు, పర్యాటకులు తీసిన వీడియోల్లో వరద ప్రవాహం ఎంత భయంకరంగా ఉందో స్పష్టంగా కనిపించింది. హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గడ్ డ్రెయిన్ కూడా పొంగిపొర్లడంతో నష్టం మరింత పెరిగింది. దీనివల్ల గంగోత్రి దామ్‌కు వెళ్లే అన్ని రహదారులు మూసుకుపోయాయి
సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), భారత సైన్యం బృందాలు రంగంలోకి దిగాయి. హర్సిల్ పోస్ట్‌లో ఉన్న భారత సైన్యం బృందం 10 నిమిషాల్లోనే గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. సుమారు 150 మంది సిబ్బంది, వైద్య పరికరాలు, రెస్క్యూ పరికరాలు, వైద్యులతో కూడిన బృందం 20 మంది గ్రామస్తులను రక్షించింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరకాశీ జిల్లా అత్యవసర ఆపరేషన్ సెంటర్ హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది: 01374222126, 01374222722, 9456556431.
ప్రభుత్వ స్పందన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ధామి మాట్లాడుతూ, “ధరాలి (ఉత్తరకాశీ) ప్రాంతంలో మేఘవిస్ఫోటనం వల్ల భారీ నష్టం వాటిల్లిన వార్త చాలా బాధాకరం. SDRF, NDRF, జిల్లా యంత్రాంగం, ఇతర సంబంధిత బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. నేను నిరంతరం సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాను. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాను. అందరూ సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు
భారత వాతావరణ శాఖ (IMD) ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్‌లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనివల్ల మరిన్ని కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న నిర్మాణాలకు, నీటి వనరులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సెల్ఫీలు, స్నానాలు లేదా ఇతర సాహస కార్యకలాపాల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఉత్తరాఖండ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Nature’s fury at its worst. Horrifying footage of the moment the flash flood hit in Uttarkashi… People seen running away but are swept away in seconds pic.twitter.com/oMZp4q9d3I
— Akshita Nandagopal (@Akshita_N) August 5, 2025