‘సోలో బ్రతుకు’ మీదే ఇండస్ట్రీ ఆశలన్నీ

కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కుదేలయ్యింది. థియేటర్ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా హాళ్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఎక్కడో ఒక మూలన భయం ఉండనే ఉంది. హాళ్లు ఓపెన్ చేస్తే కనీసం ఖర్చులకైనా డబ్బులు వస్తాయా రావా అనే భయంలో థియేటర్ యాజమాన్యాలు ఉండగా థియేటర్లకు వెళితే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళనలో ప్రేక్షకులు ఉన్నారు. వెరసి పరిశ్రమకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అనే అనుమానం ఇండస్ట్రీలోని అందరిలోనూ ఉంది.

ఇలాంటి తరుణంలోనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఈ నెల 25న చిత్రం థియేటర్లలోకి రానుంది. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే. లాక్ డౌన్ తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమా విడుదల విజయవంతమైతే ఒక ధైర్యం, నమ్మకం వస్తాయని, మిగిలిన వారు కూడ సినిమాలను విడుదలచేయడానికి ముందుకొస్తారని, థియేటర్లు సైతం పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయని ఆశపడుతున్నారు. అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి 25న ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నభా నటేష్ కథానాయకిగా నటించగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మాత.

Exit mobile version