హైదరాబాద్ సిటీ పోలీసులు ఇటీవల భారీ సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన నేపథ్యంలో, సినీ ప్రముఖులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ పంపిణీ భాగస్వాములతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పైరసీ ఎలా జరుగుతోందో, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
దర్యాప్తులో రెండు ముఖ్యమైన పద్ధతులు బయటపడ్డాయి. థియేటర్లలో మొబైల్ ద్వారా రహస్యంగా సినిమాలను రికార్డ్ చేయడం ఒకటి. మరోటి, సినిమా విడుదలకు ముందే డిజిటల్ పంపిణీ వ్యవస్థలను హ్యాక్ చేసి అసలు కంటెంట్‌ను దొంగిలించడం. తమిళ్‌ఎంవి, టెయిల్ బ్లాస్టర్స్, మూవీరుల్జ్ వంటి సైట్లు గుర్తించబడ్డాయని, ఇవి గేమింగ్-బెట్టింగ్ సంస్థల ద్వారా ఆదాయం పొందుతున్నాయని సీపీ ఆనంద్ వెల్లడించారు. పైరేటెడ్ ఫైళ్లు టొరెంట్ సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, అక్రమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు.
ఈ చొరవను సినీ పరిశ్రమ స్వాగతించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు సమావేశానికి హాజరై, పోలీసులకు తమ పూర్తి సహకారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.