ఏదైనా ఒక పండగ ఉంటే ఆ సమయంలో పెద్ద హీరోల సినిమాలు ఏవో ఒకటి సందడి చేస్తుంటాయి. అలాంటి సమయంలో చోటా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి థియేటర్ల విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ వినాయక చవితికి పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో చోటా నిర్మాతలు ఇదే అదునుగా చూసుకొని బాక్స్ ఆఫీసుపై దాడి చెయ్యనున్నారు. ఈ వినాయక చవితికి ఒక డైరెక్ట్ తెలుగు సినిమా, రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కానున్నాయి.
చాలా కాలంగా అలెగ్జాండర్ లా హిట్ కోసం బాక్స్ ఆఫీసు వద్ద దండయాత్ర చేస్తున్న కామెడీ హీరో శివాజీ ఈ వినాయక చవితికి ‘ఏం బాబు లడ్డూ కావాలా.!’ చిత్రంతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అతిధి అగర్వాల్ మరియు రచన మౌర్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి గాంధి మనోహర్ దర్శకత్వం వహించగా, జనార్ధన్ టి నిర్మించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో అవిభక్త కవలలుగా నటించిన ‘చారులత’ అనువాద సినిమా కూడా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోన్ కుమరన్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. మలయాళంలో తెరకెక్కిన మరో అనువాద థ్రిల్లర్ చిత్రం ‘అంబులి 3డి’ కూడా అదే రోజు విడుదల కానుంది. తమిళ నటుడు ప్రతిబన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ మరియు హరీష్ నారాయణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 3డి లో వస్తున్నందున ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది.
ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందో అనే దాని కోసం సెప్టెంబర్ 21 వరకు వేచి చూడాల్సిందే.