తమిళ రాజకీయ సంచలనం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలలో తలైవి ఒకటి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎం జి ఆర్ పాత్రను ప్రముఖ నటుడు అరవింద స్వామి పోషిస్తున్నారు. కాగా తలైవి చిత్రం నుండి నేడు మరో లుక్ విడుదల చేశారు. ఓ భారీ సెట్ లో అనేక మంది డాన్సర్స్ మధ్యలో ఓ నాట్య భంగిమలో ఉన్న కంగనా లుక్ అద్భుతంగా ఉంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జయలలిత భరత నాట్యం, కూచిపూడి, కథక్ వంటి అనేక నాట్యాలలో ప్రవీణురాలు. అందుకే ఈ పాత్ర చేస్తున్న కంగనా షూటింగ్ కి ముందు క్లాసికల్ డాన్స్ నందు కొంత శిక్షణ తీసుకున్నారు. ఇక విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 26 విడుదల కానుంది.