నటుడు సొనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవ చేశారు. ప్రధానంగా పొరుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి, సొంత ఊళ్లకు వెళ్లలేక, పనులు లేక అనేక అవస్థలు పడుతున్న వందల మంది కూలీలను సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చారు సొనూసూద్. అంతేకాదు ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉన్నవారు, ఆకలి బాధలు పడుతున్నవారు ఇలా ఎంతో మందికి సోనూసూద్ సహాయం అందింది. సోషల్ మీడియాలో ఇదిగో పలానా చోట పలానా మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటూ సందేశం పంపితే ఇదిగో నేనున్నాను అంటూ గంటల వ్యవధిలో సహాయం చేసేస్తున్నారు సోనూసూద్.
దీంతో సహాయం కోసం ఆయన్ను వెతుక్కుంటూ వెళ్తున్నారు జనం. సోనూ సైతం..పిల్లలకు ఆపరేషన్ల దగ్గర నుండి చదువులు, ఉద్యోగాలు అంటూ అన్ని రకాలుగా వారిని ఆదుకుంటున్నారు. దీంతో ఆయన్ను దేవుడిలా చూస్తున్నారు జనం. చూడటంతోనే ఆగకుండా ఏకంగా గుళ్లు కట్టేస్తున్నారు. యూపీ, బీహార్ లోని పలు ప్రాంతాల్లో గుళ్లు కట్టి పూజలు చేస్తున్నారు. దక్షిణాదిన అయితే ఇళ్లలోనూ, దేవాలయాల్లోనూ సోనూ ఫొటోలను దేవాలయాల్లో ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలను చూసిన సోనూ సూద్ తనకు అంతటి యోగ్యత లేదని అంటూ ట్వీట్ చేయగా నెటిజన్లు మాత్రం అడగ్గానే సహాయం చేసే వారిని దేవుడనే అంటారని పొగడ్తలు కురిపిస్తున్నారు.