తెలుగు సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతామని ఇటీవల ప్రకటించారు. దీంతో నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి సమావేశమై, ఇకపై నైపుణ్యం ఉన్నవారికి నేరుగా అవకాశాలు ఇస్తామని.. యూనియన్లతో సంబంధం లేకుండా ఈ అవకాశాలు ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నిర్మాతలు సి.కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ ఉన్నారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మేము చిరంజీవి గారిని కలసి సమస్య గురించి చెప్పాము. షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు. మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను అని చిరంజీవి గారు చెప్పారు. రెండు మూడు రోజులు చూసి పరిస్థితి చక్కబడకపోతే ఆయన జోక్యం చేసుకుంటానని తెలిపారు’ అంటూ కళ్యాణ్ తెలిపారు.
ఇక మరోవైపు సినీ కార్మికుల ఆందోళనపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే వారికి జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో మాట్లాడతానని.. ఈ అంశాలన్నిటిని కూడా దిల్ రాజుకు అప్పగించామని.. ఆయన చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది.. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై నిర్మాతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.