నిఖిల్, స్వాతి నటించిన ‘స్వామి రారా’ సినిమా ఈ ఏడాది ప్రధమార్ధంలో విడుదలై క్రైమ్ కామెడీ తరహా సినిమాలకు కొత్త ఆజ్యం పోసింది. దొంగతనానికి గురైన ఒక వినాయకుని విగ్రహాన్ని సంపాదించాలనే కాంక్షతో కొంత మంది చేసే ప్రయత్నాన్ని దర్శకుడు సుధీర్ వర్మ తెరపై అద్భుతంగా చూపించాడు. ఒక ఖతర్నాక్ దొంగగా నిఖిల్ చక్కని నటనను కనబరిచాడు. సంగీతం, నేపధ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పుడు ఈ సినిమా కన్నడలో పునర్ణిర్మాణం కానుంది. నిఖిల్ పాత్రను ప్రజ్వాల్ పోషించనున్నాడు. సంజన చెల్లెలు అయిన నిక్కీ గల్రాణి జర్నలిస్ట్ పాత్రను పోషించనుంది. విష్ణు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఆగష్టు 2వ వారం నుండి మొదలుకానుంది. ప్రస్తుతం నిఖిల్, స్వాతి చందు తీస్తున్న ‘కార్తికేయ’ సినిమాతో బిజీగా వున్నారు. ఈ సినిమా మొత్తాన్ని సెట్ గా వేసిన ఒక గుడి నేపధ్యంలో వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు