తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణగారికే దక్కుతుంది. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం అవకాశం దొరికినా ముందుకు దూకేవారు ఆయన. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయడానికి అనుక్షణం తపించేవారు. అప్పట్లో ఆయన చేసిన కొన్ని ప్రయోగాల మూలంగానే ఈనాడు తెలుగు సినిమా కాల పరిణామాలకు అనుగుణంగా దూసుకుపోతోందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా కృష్ణగారు చేసిన ప్రయోగాల్లో 1990 నవంబర్ 11న విడుదలైన ‘నాగాస్త్రం’ కూడ ఒకటి. ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు కృష్ణగారు.
ఈ సినిమా విడుదలై రేపటితో 30 సంవత్సరాలు పూర్తికానుంది. ఎన్వీఎస్ క్రియేషన్స్ పతాకంపై నన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.గోపికృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్ బాధ్యతలను చూసుకున్నారు. ఇందులో కృష్ణకు జోడీగా విజయశాంతి నటించగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, అన్నపూర్ణ, వై.విజయ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు చేశారు. కృష్ణగారి స్వీయ దర్శకత్వం కావడం వలన ప్రకటన రోజునే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతలా అంటే సినిమా పూర్తయ్యాక డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. హక్కులన్నీ అమ్ముడయ్యేసరికి 10 లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ కనబడింది నిర్మాతకు.
3 దశాబ్దాల క్రితం 10 లక్షల టేబుల్ ప్రాఫిట్స్ అంటే ఈరోజు పదుల కోట్లలో ఉంటుంది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు క్లాప్ కొట్టడంతో మొదలైన సినిమా విడుదలయ్యాక అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాప్ కొట్టడమే కాదు నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడ తీసుకున్నారు ఎం.ఎస్.రెడ్డిగారు. అలా కృష్ణగారు తన బహుముఖ ప్రజ్ఞతో సృష్టించిన అద్భుతాల్లో ‘నాగాస్త్రం’ కూడ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. శాతవాహన చిత్రానికి కథను అందించగా త్రిపురనేని మహారథి మాటలు రాశారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి వేటూరి, సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పి.సుశీల, ఎస్.జానకి, నాగర్ బాబు లాంటి ప్రముఖ గాయకులు పాటలు పాడారు.
పుష్పాల గోపికృష్ణ సినిమాటోగ్రఫీ చేయగా కృష్ణగారు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చూసుకున్నారు.