కూకట్ పల్లిలో ‘శ్రీమన్నారాయణ’ సినిమా ఆడుతున్న అర్జున్ థియేటర్లో బాలకృష్ణ అభిమానులు అందోలనకి దిగారు. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే బాలయ్య జర్నలిస్ట్ పాత్రలో నటించిన శ్రీమన్నారాయణ చిత్రం గత వారం ఆగష్టు 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూకట్ పల్లి లోని అర్జున్ థియేటర్లో వేసారు. వారం రోజులు అయిన తరువాత ఈ సినిమా స్థానంలో నాగార్జున నటించిన ‘శిరిడి సాయి’ చిత్రాన్ని ఈ రోజు నుండి ప్రధర్శించనున్నారు. అయితే మంచి కలెక్షన్లతో నడుస్తున్న తమ అభిమాన హీరో సినిమా స్థానంలో వేరే సినిమా వేయడం అన్యాయం అంటూ బాలయ్య అభిమానులు ఆందోళనకి దిగారు. ఈ ఆందోళనలో శ్రీమన్నారాయణ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, దర్శకుడు రవికుమార్ చావాలి, రచయిత పోలుర్ ఘటికాచలం కూడా పాల్గొన్నారు. ఈ విషయం పై థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదించగా శిరిడి సాయి చిత్ర అగ్రిమెంట్ చాలా రోజుల క్రితమే జరిగిపోయిందనీ, ఆ తరువాత శ్రీమన్నారాయణ చిత్రానికి థియేటర్లు లేకపోవడంతో ఒక వారం రోజులు వరకు ప్రదర్శించేందుకు అగ్రిమెంట్ జరిగిందని అంటున్నారు. బాలయ్య అభిమానులు మాట్లాడుతూ తాము ఏ హీరోకి వ్యతిరేకం కాదనీ, మంచి కలెక్షన్లతో నడుస్తున్న శ్రీమన్నారాయణ సినిమా మళ్లీ ప్రదర్శించే వరకు ఆందోళన చేస్తామని అంటున్నారు. ఈ ఆందోళన ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.