‘100 పర్సెంట్ లవ్’ చిత్రంతో గీత రచయితగా పరిచయమై, అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత శ్రీమణి. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరోల సినిమాలకు పాటలు రాసిన శ్రీమణి, తన పుట్టినరోజు (సెప్టెంబరు 15) సందర్భంగా మీడియాతో తన కెరీర్ విశేషాలను పంచుకున్నారు.
ఈ సంవత్సరం తాను రాసిన పాటలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని శ్రీమణి తెలిపారు. ముఖ్యంగా ‘తండేల్’ లోని “బుజ్జితల్లి”, “హైలెస్సా” పాటలు, అలాగే ‘లక్కీ భాస్కర్’ లోని “నిజమా కలా”, ‘ఆయ్’ సినిమాలోని పాటలు తనకు మంచి పేరు తెచ్చాయని చెప్పారు. కథలోని లోతైన భావాలను చెప్పే అవకాశం రావడం గర్వంగా ఉందని, ఈ అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి పాటకు ఒక ఛాలెంజ్ ఉంటుందని, ట్రెండ్‌కు తగ్గట్టుగా, కాలపరిమితి లేకుండా సాహిత్యం ఎప్పుడూ ఫ్రెష్‌గా అనిపించేలా ప్రయత్నిస్తానని శ్రీమణి వివరించారు. ప్రేమ పాటల్లో కొత్తదనం చూపించడానికి సున్నిత పదాలతో, అర్థమయ్యేలా భావోద్వేగాలను పలికిస్తానని చెప్పారు. తాను రాసిన ప్రతి పాట తనకు ఇష్టమేనని, రచయితగా ఎప్పుడూ ఇంకా కొత్త సాహిత్యం అందించాలనే కోరుకుంటానని అన్నారు.
సోషల్ మీడియా ట్రెండ్‌లో పాటలు తక్షణమే హిట్ అవ్వడం ఒక సవాలుగా మారిందని, అయినా పదేళ్ల తర్వాత కూడా అదే ఫీలింగ్ ఉండేలా పాటలు రాస్తున్నామని పేర్కొన్నారు. ‘అరడుగుల బుల్లెట్’ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, ‘ఎక్కడ ఎక్కడ’ తర్వాత ప్రేమ పాటలు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ‘మహర్షి’లోని “ఇదే కదా” పాటను కథ మొత్తం విని రాశానని గుర్తు చేసుకున్నారు.
తన పాటల గురించి సుకుమార్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్ప వ్యక్తులు మెచ్చుకున్నప్పుడు ఎంతో సంతృప్తి కలుగుతుందని శ్రీమణి అన్నారు. దర్శకత్వం వైపు ఆలోచన లేదని, కానీ పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది తన బలమైన కోరిక అని స్పష్టం చేశారు. రచన అంటే తనకు ప్రాణమని, సాహిత్యం విలువ పెంచడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఓ తార’, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, ‘ఇండియా హౌస్’ వంటి చిత్రాలకు పాటలు అందిస్తున్నట్లు తెలిపారు.