సమీక్ష : 3 బి.హెచ్.కె (3 BHK) – స్లో గా సాగే ఎమోషనల్ డ్రామా

సమీక్ష : 3 బి.హెచ్.కె (3 BHK) – స్లో గా సాగే ఎమోషనల్ డ్రామా

Published on Jul 5, 2025 12:02 AM IST

3BHK

విడుదల తేదీ : జూలై 04, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శరత్ కుమార్, సిద్ధార్థ్, దేవయాని, మీతా రఘునాధ్, చైత్ర జె అచర్ తదితరులు
దర్శకత్వం : శ్రీ గణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ
సంగీతం : అమృత్ రామ్‌నాథ్
సినిమాటోగ్రఫీ : దినేష్ బి కృష్ణన్, జితిన్ స్టానిస్లాస్
ఎడిటర్ : గణేష్ శివ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హీరో సిద్ధార్థ్, శరత్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 3 బి.హెచ్.కె(3 BHK) టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో ఒకింత మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ప్యూర్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రమోట్ చేసింది. ఈ సినిమా నేడు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
వాసుదేవన్(శరత్ కుమార్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడి భార్య శాంతి(దేవయాని), కొడుకు ప్రభు(సిద్ధార్థ్), కూతురు ఆర్తి(మీతా రఘునాథ్)లతో జీవితం సాగిస్తుంటాడు. ఎప్పటికైనా ఓ సొంత ఇల్లు కట్టుకోవాలనేది అతడి కల. అయితే, కుటుంబం కష్టాలు అడ్డుపడటంతో అతడి కల కలగానే ఉండిపోతుంది. తన కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి తమ కల నెరవేర్చాలని వాసుదేవన్ కోరుకుంటాడు. మరి ప్రభు తన తండ్రి కలను నెరవేర్చాడా..? తన తండ్రి చెప్పిన బాటలోనే విక్రమ్ ప్రయాణిస్తాడా..? వాసుదేవన్ కూతురు ఆర్తి జీవితం ఎటువైపు సాగుతుంది..? చివరకు ఏం జరుగుతుంది..? అనేది ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :
ఓ మధ్య తరగతి వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపెట్టారు. సొంత ఇల్లు అనేది చాలా మంది కల. ఆ కల కొందరికి నెరవేరుతుంది.. మరికొందరికి నెరవేరే సమయానికి ఏదో ఓ అడ్డంకి రావడంతో దానిని పక్కకు పెడతారు. ఈ సినిమా కథ కూడా ఇదే ట్రాక్‌పై సాగుతుంది. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది.

ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే.. శరత్ కుమార్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ఓ మధ్యతరగతి తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ బాగున్నాయి. అటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో చాలా మేకోవర్స్‌తో కనిపించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా తండ్రి-కొడుకు మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి.

కథలోని కోర్ పాయింట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కడా కథను సైడ్ ట్రాక్ కాకుండా చూసుకున్నారు. ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకుల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ ఈ కథకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :
ఇలాంటి సింపుల్ కథను సరిగ్గా హ్యాండిల్ చేస్తే వండర్స్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ కథలను ఇష్టపడని వారు ఉండరు. అలాంటి కథతో వచ్చిన ఈ సినిమాను పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. కానీ, ఈ సినిమాకు బలంగా నిలిచిన కథను స్క్రీన్ ప్లే తో బలహీనంగా మార్చాడు దర్శకుడు.

ఈ సినిమాలోని ఎమోషన్స్ బాగానే వర్కవుట్ అవుతాయి. అయితే, ప్రతిసారి అదే ఎమోషన్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. కొత్తగా ఏదైనా ఉంటుందేమో అని ప్రేక్షకులు ఎదురుచూసేలా ఈ ఎమోషన్ చేస్తుంది. కానీ, వారికి సినిమాలో తండ్రీ-కొడుకుల మధ్య కొత్తగా ఏ అంశం కూడా కనిపించదు.

చాలా సీన్స్ మనకు వేరే సినిమాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బొమ్మరిల్లు’ సినిమా మనకు ఈ సినిమాలోని చాలా సీన్స్‌కు కనెక్ట్ అవుతుంది. చూసిన సినిమాలోని సీన్స్‌ను మళ్లీ చూడటం ప్రేక్షకులను మెప్పించదు.

ఇక యాక్టర్స్ పరంగా అందరూ పర్వాలేదనిపించినా, యోగిబాబు లాంటి స్టార్ కమెడియన్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోదు. చాలా సీన్స్ సాగదీతతో సాగడం మేజర్ డ్రాబ్యాక్. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఈ సాగదీత సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి.

సాంకేతిక విభాగం :
దర్శకుడు శ్రీ గణేష్ రాసుకున్న కథ సింపుల్ అయినా, దానిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగా వర్కవుట్ అయ్యేది. కానీ, ఆయన ఈ చిత్రాన్ని సాగదీత స్క్రీన్‌ప్లే తో పక్కదారి పట్టించాడు. కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా చప్పగా ప్రెజంట్ చేసినట్లు అనిపిస్తుంది. కామెడీ ఎలిమెంట్స్ కూడా ఏమాత్రం లేకపోవడం మైనస్. అటు సంగీతం పరంగా పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. బీజీఎం మాత్రం కథకు తగ్గట్లుగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్‌పై చాలా కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా బాగుంది.

తీర్పు :
ఓవరాల్‌గా, 3 బి.హెచ్.కె(3 BHK) చిత్రం మిడిల్ క్లాస్ కథతో వచ్చిన ఓ నీట్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంది. సింపుల్ కథ, సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, స్లో గా సాగే స్క్రీన్ ప్లే, ల్యాగ్ సీన్స్ ఈ చిత్రానికి మైనస్. ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడేవారికి ఈ సినిమాలోని కొన్ని మూమెంట్స్ కనెక్ట్ అవుతాయి

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు