మరో ఫారిన్ ట్రిప్ కి సిద్దమవుతున్న షాడో టీం


విక్టరీ వెంకటేష్ హీరోగా, అందాల భామ తాప్సీ కథానాయికగా శ్రీకాంత్ మరియు మధురిమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘షాడో’ టీజర్ నిన్న విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. వెంకీ సరికొత్త స్టైలిష్ లుక్ తో మరియు వెంకీ ఎప్పుడూ చేయని భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ అక్టోబర్ 8 నుండి మలేషియాలో ప్రారంభం కానుంది. ‘ షాడో ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కోసం ఈ నెల 8న మళ్ళీ మలేషియా వెళ్తున్నాం. అక్కడ 17 రోజులు చిత్రీకరణ జరుపుకొని ఈ నెల 27న తిరిగి వస్తామని’ మెహర్ రమేష్ ట్వీట్ చేసారు.

మలేషియా షెడ్యూల్ తో ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుంది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ ని లంకావిలో చిత్రీకరించారు. పరుచూరి శివరాంప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథ అందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Exit mobile version