మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిన సంగతి తెలుసుకుని అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పెద్ద హీరోలంతా ఒక్కూకారిగా బయటికి వస్తున్నారు. అయిపోయిన సినిమాలను రీస్టార్ట్ చేసుకుంటున్నారు. ఇతరత్రా పనులను చక్కబెట్టుకుంటున్నారు. చిరు కూడ గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమై ఇటీవలే బయటికి రావడం స్టార్ట్ చేశారు. పెళ్ళిళ్ళు, ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతున్నారు.
ఇంకో రెండు మూడు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. ఈలోపు ఆయనకు కరోనా అని తేలడంతో మెగా అభిమానులే కాదు ఇతర హీరోల అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలంతా ఆరు పదుల వయసుకు దగ్గరగా ఉన్నవారే. అయినా ధైర్యం చేసి సినిమాలను మొదలుపెడుతున్నారు. అంతా సర్దుకుంది అనుకునే సమయానికి చిరు విషయంలో ఇలా జరగడంతో మిగతా హీరోల విషయంలో కంగారు మొదలైంది. ఇంకాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ అంతా తగ్గాకే సినిమాలు చేసుకోవచ్చు, వీలైనంత వరకు సీనియర్ హీరోలు ఎవరినీ కలవకుండా ఉంటేనే బెటర్ అంటూ సూచన చేస్తున్నారు.