ఇంటర్వ్యూ : దర్శకుడు సంజీవ్ రెడ్డి – ‘సంతాన ప్రాప్తిరస్తు’లో మంచి మెసేజ్ ఉంటుంది..!

మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షేక్ దావూద్ జీ స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

-తాను మొదట ఫైనాన్స్ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పనిచేసినట్లు సంజీవ్ రెడ్డి తెలిపారు. తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలోని మహాత్మ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి తన ఫిల్మ్ జర్నీ ప్రారంభించారు. హిందీలో చేసిన లాగిన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సినిమా తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్గా రీమేక్ అయింది. తరువాత ఏబీసీడీ, అహా నా పెళ్లంట వంటి ప్రాజెక్టులు తెరకెక్కించారు. యాడ్స్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కమర్షియల్స్‌కి కూడా దర్శకత్వం వహించారు.

-సమాజంలో ఉన్న మేల్ ఫెర్టిలిటీ ఇష్యూపై ఇప్పటివరకు తెలుగు సినిమా రాకపోవడంతో, తనకు తెలిసిన కొందరి అనుభవాల ఆధారంగా ఈ కథను రూపొందించారన్నారు. ఆధునిక వైద్యం సహాయంతో పిల్లలు పొందినా, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, సొసైటీ ప్రెజర్‌ను హ్యూమర్ టచ్‌తో చూపించాలని నిర్ణయించుకున్నారు.

-విక్రాంత్ ఈ కథ విన్న వెంటనే అంగీకరించాడు. రైటర్ కల్యాణ్ రాఘవ్‌తో కలిసి ఈ స్క్రిప్ట్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా డిజైన్ చేశారన్నారు. సమస్యను ఓవర్‌డ్రామా కాకుండా హ్యూమరస్‌గా చూపించామని తెలిపారు. చాందినీ చౌదరిని హీరోయిన్‌గా ఎంచుకోవడం వెనుక కారణం – ఆమె తెలుగమ్మాయి కావడం, అలాగే మ్యారీడ్ వుమన్ రోల్‌కి ధైర్యంగా అంగీకరించడం. నటుడిగా తరుణ్ భాస్కర్ తన పాత్రను ఇంప్రూవ్ చేశారని ప్రశంసించారు.

-సంతాన ప్రాప్తిరస్తులో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మేళవించామని దర్శకుడు తెలిపారు. ఈ కథలో హీరోకు ఉన్న లో స్పెర్మ్ కౌంట్ సమస్య కథానాయక అంశం. అయితే ఎక్కడా ఫన్ చేయకుండా, డిగ్నిటీతో సమస్యను చూపించామని చెప్పారు.

-ఈ సినిమా ఒక సున్నితమైన అంశంపై అవగాహన కలిగిస్తుందని, ఒక చిన్న మెసేజ్ కూడా అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు చూసిన ప్రివ్యూ ఆడియెన్స్ అందరూ పాజిటివ్‌గా స్పందించారని, అలాగే ప్రేక్షకులు కూడా అదే ప్రేమను చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. “ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్య మాత్రమే మాట్లాడే ఈ అంశాన్ని ఓపెన్‌గా చర్చించే మార్పుకు మా సినిమా మొదటి అడుగు అవుతుందని నమ్ముతున్నా,” అని దర్శకుడు అన్నారు.

Exit mobile version