సమంత మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుందా?


అన్నీ అనుకున్నట్లు జరిగితే అందాల భామ సమంత, యువ సామ్రాట్ నాగ చైతన్య మరోసారి జత కట్టే అవకాశం ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి ‘త్రయం’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటించడానికి దర్శకుడు సమంతతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కానీ సమంత ఇంకా ఈ చిత్రానికి అంగీకారం తెలుపలేదు. గతంలో నాగ చైతన్య మరియు సమంత కాంబినేషన్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా మంచి విజయాన్ని సాదించింది, అలాగే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆటో నగర్ సూర్య’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లక్కీ కపుల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ ఐతే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ‘త్రయం’ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం సమంత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తోంది, త్వరలోనే ‘ఎవడు’ చిత్ర చిత్రీకరణలో పాల్గోనబోతోంది. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఈ సినిమాకి ఒప్పుకుంటుందా? లేదా? అనేది తెలియడం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడు తరాల నటులు కలిసి నటించనున్న మొదటి సినిమా ఇది కావడం విశేషం. ఇది ఎవరెవరితో తెరకెక్కుతుందో అనే దాని కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version