తెలుగు నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2016లో అక్కినేని నాగార్జున నిర్మాణంలో వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోగా పరిచయమైన రోషన్, ఆ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని 2021లో ‘పెళ్ళి సందడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాల్లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులు మరియు విమర్శకులను ఆకట్టుకున్నాడు. అయితే, ఇప్పుడు తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ కోసం రోషన్ ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో రోషన్ ‘చాంపియన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతుండగానే రోషన్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను సైన్ చేశాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీతో తన ప్రతిభను చాటిన శైలేష్‌తో రోషన్ సినిమా చేయనున్నాడనే వార్తతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.