విడుదల తేదీ : నవంబర్ 01, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, తారక్ పొన్నప్ప, సీనియర్ నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు.
దర్శకుడు : భాను భోగవరపు
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్ : విధు అయ్యన్న
ఎడిటర్ : నవీన్ నూలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేడు పడ్డాయి. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీస్ గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లక్ష్మణ్ భేరి, అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఆ ఊరిలో శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్ భేరి అడ్డు నిలుస్తాడు. అసలు శివుడు వెనుక ఉన్నది ఎవరు ?, వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, ఈ మధ్యలో తులసి (శ్రీలీల) తో లక్ష్మణ్ భేరి ప్రేమ కథ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ మాస్ జాతర సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీలీల తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ పాత్రలో నవీన్ చంద్ర చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ చాలా బాగా నటించాడు.
ఈ సినిమాలో తాత పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే సీనియర్ నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆదిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సీన్స్, రవితేజ పాత్ర ఎటాక్ చేస్తూ అసలు నిజాలు కనుక్కునే కొన్ని సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
రవితేజ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న భాను భోగవరపు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.
ఒక్క క్లైమాక్స్ లో తప్ప కొన్ని చోట్ల కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి నందు రాసిన డైలాగ్స్, హీరో రవితేజ క్యారెక్టరైజేషన్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు భాను భోగవరపు తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ నవీన్ నూలి తగ్గించాల్సింది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘మాస్ జాతర’ అంటూ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా రెగ్యులర్ గా సాగడం, అదేవిధంగా కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా రవితేజ నటనతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
