సమీక్ష: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ – కొన్ని చోట్ల మెప్పించే విలేజ్ డ్రామా

Kothapallilo Okappudu Movie Review

విడుదల తేదీ : జూలై 18, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మనోజ్ చంద్ర, మోనిక టి, ఉష బోనెలా, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్
దర్శకురాలు : ప్రవీణ పరుచూరి
నిర్మాతలు : గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి
సంగీతం : మణి శర్మ, వరుణ్ ఉన్ని
సినిమాటోగ్రఫీ : పెట్రోస్ అంటోనియాడిస్
కూర్పు : కిరణ్ ఆర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నూతన నటీనటులతో టాలీవుడ్ క్లాసిక్ ‘కేరాఫ్ కంచరపాలెం’ నటి ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కించిన మరో చిత్రమే ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మరి ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1997 సమయం కొత్తపల్లి అనే ఒక మారుమూల కుగ్రామంలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఆ ఊరి ప్రజలకి అప్పులిచ్చి వారిని వడ్డీలతో పీడిస్తూ ఉంటాడు. తన దగ్గరే పని చేసే కుర్రాడు రామకృష్ణ (మనోజ్ చంద్ర) ఆ ఊరి జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక) ని చిన్నతనం నుంచే ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమ ఆమెకి చెప్పే క్రమంలో మరో అమ్మాయితో పెళ్లి బలవంతంగా ఫిక్స్ అవుతుంది. ఇంకోపక్క అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊరిలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అప్పన్న అంటే ఆ ఊరి జనానికి భయం కాస్తా అపారమైన భక్తిగా ఎలా మారిపోయింది? అప్పన్నకి రెడ్డి ఉన్న వైరం ఏంటి? అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కేరాఫ్ కంచరపాలెం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆడియెన్స్ లో మినిమమ్ అంచనాలు అయినా ఉంటాయి. అయితే వాటిని కొంతమేర ఈ సినిమా అందుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నాచురాలిటీతో కూడిన విజువల్స్ కానీ మాటలు గాని సినిమాలో ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ లో ఆరంభం కొంచెం సోసో గానే మొదలైనా తర్వాత మాత్రం సినిమా పికప్ అయ్యి డీసెంట్ గా మంచి కామెడీ సీన్స్ తో వెళుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ అయితే మంచి హిలేరియస్ గా కూడా వర్క్ అవుతాయి.

అలాగే దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. దానికి అనుగుణంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ సహా మైంటైన్ చేసిన థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. ఇక నటీనటుల్లో డెబ్యూ నటీనటులు బాగా చేశారు. హీరో మనోజ్ చంద్ర ఉత్తరాంధ్ర మాండలీకంలో మంచి బాడీ లాంగ్వేజ్, లుక్స్ తో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ కూడా సినిమాలో బాగుంది.

అలాగే హీరోయిన్ మౌనిక తన పాత్రకి సరిగ్గా ఫిట్ అయ్యింది. నాచురల్ లుక్స్ తో మంచి నటన కనబరిచింది. ఇక వీరితో పాటుగా ఉషా బోనెలా ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఆమెపై కామెడీ సీన్స్, ముఖ్యంగా హీరోతో సీన్స్ ఫన్ గా ఉన్నాయి. ఇక వీరితో పాటుగా మరో సాలిడ్ పెర్ఫార్మర్ రవీంద్ర విజయ్ తన మార్క్ సహజ నటన మాడ్యులేషన్స్ తో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అప్పన్నగా చూపించారు. తనతో పాటుగా బెనర్జీ, బాబు మోహన్ లాంటి వారు తమ సీనియార్టీ చూపించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఎంచుకున్న లైన్ బానే ఉంది కానీ ఇది సదా సీదాగా థియేటర్ కి వచ్చి చూసే జనానికి అర్ధం కాకపోవచ్చు. సినిమా మొదలవుతున్నప్పుడే ఒక లైన్ ఉంటుంది. ‘మనం వస్తువులను ఉన్నట్టుగా చూడము, మనం ఎలా అనుకుంటున్నామో అలా చూస్తాము.’ అన్నట్టుగా ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది.

అయితే ఇది చూసి చదివే వారికి అంటే ఓకే కానీ దీనికోసం తెలీకుండా సినిమాలో జరిగే డ్రామా అంతా చూస్తే మాత్రం ఆడియెన్స్ కి ఒకింత సిల్లీ ఫీల్ కలుగుతుంది. అలాగే అప్పన్న బండిపై చూపించే కొన్ని సన్నివేశాలు, ఆ ఊరి జనం ఆకస్మిక మార్పు, మూఢ నమ్మకాలు లాంటివి ఒకింత అతిగా, ఫోర్స్డ్ గా అనిపిస్తాయి.

అలాగే నటుడు రవీంద్ర విజయ్ పాత్ర ఇంకొంచెం ఎక్కువ ఉంచితే బాగుండు అనిపిస్తుంది. అలాగే తన రోల్ ని అర్ధాంతరంగా ఆపేయడాన్ని ఇంకొంచెం ప్రభావవంతంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓకే రేంజ్ లో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవు. మణిశర్మ ఇచ్చిన పాటలు బాగున్నాయి. వరుణ్ ఉన్ని స్కోర్ కూడా బాగుంది. పెట్రోస్ అంటోనియాడిస్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. మంచి సన్నివేశాలు చూపించారు. అలాగే ఎడిటింగ్ కూడా ఓకే కానీ కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. డబ్బింగ్ అతెంటిక్ గా ఉండి సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఇక సినిమాలో నటి గానే కాకుండా దర్శకత్వ భాద్యతలు తీసుకున్న ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే.. ఆమె ఒక బ్యూటిఫుల్ లైన్ ని ఎంచుకున్నారు. తాను అనుకున్న పాయింట్ ని దాదాపు మంచి ఎమోషనల్ గా అలాగే ఫన్ తో కూడా చెప్పే యత్నం చేశారు. అయితే ఇందులో కొన్ని చోట్ల మాత్రం ఆ సహజత్వం లోపించింది. అనుకున్న పాయింట్ ని చెప్పే ప్రయత్నంలో కథనాన్ని ఇంకొంచెం బెటర్ సీన్స్ తో డిజైన్ చేసుకొని ఉంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మరికాస్త ఫీల్ గుడ్ గా అనిపించి ఉండేది. ఓవరాల్ గా తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “కొత్తపల్లిలో ఒకప్పుడు” కొన్ని చోట్ల మెప్పించే విలేజ్ కామెడీ, థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు. లీడ్ నటీనటులు బాగా చేసి మెప్పించారు. సినిమాలో లైన్ బాగానే ఉంది అందుకు అనుగుణంగా అల్లుకున్న కథనం, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో మాత్రం సిల్లీగా అనిపిస్తాయి అలాగే సహజత్వాలు లోపించాయి. ఇవి పక్కన పెడితే తక్కువ అంచనాలు పెట్టుకొని వీకెండ్ కి ట్రై చెయ్యండి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version