సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంలేదని తెలిసిందే. ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, దయచేసి తనను క్షమించాలని ఆయన అభిమానులను కోరారు. రజినీ తీసుకున్న ఈ సంచలనం నిర్ణయంతో దాదాపు దశాబ్దంన్నర కాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి, ఆవేదనకు లోనయ్యారు. కొందరేమో రాజకీయాలకంటే ఆయన ఆరోగ్యమే ముఖ్యమని రజినీ నిర్ణయాన్ని స్వాగతించగా ఇంకొందరు మాత్రం ఇంతవరకు వచ్చాక పార్టీ పెట్టకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసహనం చూపడమే కాదు వీలున్న అన్ని దారుల్లో ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు. కొందరేమో ఆయన ఇంటి ముందు, కార్యాలయాల ముందు నిరసనలు చేస్తే ఇంకొందరు సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానెళ్లలో రజినీ నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ మరోసారి స్పందించాల్సి వచ్చింది. తన నిర్ణయాన్ని తాను ఇది వరకే వివరించానని చెప్పిన ఆయన దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దని, తాను రానని అన్నారు. అంతేకాదు తనంటే గిట్టనివారు చేసే కుట్రల్క్స్లో భాగం కావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరి ఆయన నిర్ణయాన్ని అభిమానులు ఎంతవరకు గౌరవిస్తారో చూడాలి.