ఆగష్టు 9న రానున్న రాజేంద్ర ప్రసాద్ ‘ఓనమాలు’


విలక్షణ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుకుగా తెరకెక్కిన చిత్రం ‘ఓనమాలు’. ‘మంచి జ్ఞాపకం లాంటి సినిమా’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగష్టు 09న విడుదల చేయనున్నారని తెలిసింది. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 22న విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర విడుదల తేదీని ముందుకు జరిపారు. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో స్కూల్ హెడ్ మాస్టారుగా కనిపించనున్నారు. క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరించారు. కుటుంబ కథా చిత్రాల కథానాయిక కళ్యాణి ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి ఇది ‘ఒక అచ్చమైన తెలుగు కథ’ అని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా, ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. హరి అనుమోలు ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ మరియు ‘మీ శ్రేయోభిలాషి’ లాంటి చిత్రాలలానే ఈ చిత్రం కూడా తన కెరీర్లో ఒక చిరస్మరణీయ చిత్రంగా నిలిచిపోతుందని రాజేంద్ర ప్రసాద్ భావిస్తున్నారు.

Exit mobile version