విడుదల తేదీ : సెప్టెంబరు 7, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రీ, రాజా రాంబాబు, సాయి తేజ గోన
దర్శకుడు : వరా ముళ్లపూడి
నిర్మాతలు : విశ్వాస్ హన్నూర్కర్, రాఘవేంద్ర వర్మ
సంగీతం : సాయి మధుకర్
సినిమాటోగ్రఫీ : గంగనమోని శేఖర్
ఎడిటింగ్ : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రతీ వారం లానే ఈ వారం కూడా మన తెలుగు ఓటిటి యాప్ ఈటీవీ విన్ నుంచి ప్రసారంకి వచ్చిన కథా సుధా కొత్త ఎపిసోడ్ నే “మౌనమే నీ భాష”. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక చిన్న గ్రామంలో ఉండే భార్యాభర్తలు రామ భద్రయ్య (రాజీవ్ కనకాల), సుభద్ర (ప్రమోదిని మురుగన్) ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారి పిల్లలు మాత్రం సిటీలో బిజీ లైఫ్ లో ఉంటారు. ఓరోజు సుభద్ర పుట్టినరోజుకి వారి పిల్లలు కనీసం విష్ చేయలేదు, కనీసం తమ దగ్గరకి కూడా రావడం లేదు అనే నెపంతో భద్రయ్య వారిని రప్పించడానికి ఒక ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్టే వారూ వస్తారు. కానీ ఇంతలో భద్రయ్యకి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగి మంచాన పడతాడు. మరి అక్కడ నుంచి ఈ భార్య భర్తల బంధం ఎలా సాగింది? పిల్లలు ఏం చేశారు? భద్రయ్య ఏం చెప్పి వారిని రప్పించారు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో బలమైన అంశం ఏదన్నా ఉంది అంటే ఆకట్టుకునే ఎమోషన్స్ అని చెప్పాలి. శ్రీ కాళీ పట్నం రామారావు గారు రచించిన సంకల్పం అనే రచన ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రంలో ఎమోషన్స్ పరంగా కట్టిపడేస్తుంది. ప్రస్తుత తరం తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారు కనీస సమయం కూడా తల్లిదండ్రులకి కేటాయించలేకపోవడం వంటి అంశాలు ఎమోషనల్ గా చూపించిన విధానం బాగుంది.
ఈ ఎపిసోడ్ లో మరో ఎసెట్ రాజీవ్ కనకాల, నటి ప్రమోదిని మురుగన్ లు. ఇద్దరూ అన్యోన్య దంపతులుగా ఖచ్చితంగా చాలామంది తమ తల్లిదండ్రులని గుర్తు చేసే అవకాశం ఉంది. ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమగా ఉంటారు కష్టంలో ఉన్నపుడు ఎంత తల్లడిల్లిపోతారు అనేది చాలా బాగా చేసి చూపించారు.
పిల్లలు తమ విషయంలో ఎంత బిజీగా ఉన్నా అమ్మ చూపించే ప్రేమ ఎలాంటింది, నాన్న కోపం అందులోని భావోద్వేగాల్ని చూపించిన విధానం మెప్పించింది. ఇలా ఇద్దరూ, వారిపై చూపించిన కఠువుగానే ఉన్నప్పటికీ ఎమోషన్స్ మాత్రం ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచాయి. అలాగే నేపథ్య గీతాలు ఈ ఎపిసోడ్ లో బాగున్నాయి. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలో బాగా సూటయ్యి మంచి నటన ప్రదర్శించారు.
మైనస్ పాయింట్స్:
భావోద్వేగాల పరంగా బలంగా ఉన్న ఎపిసోడ్ ఒకింత లాజికల్ గా వెనుకపడింది అని చెప్పక తప్పదు. రాజీవ్ కనకాల పాత్ర ప్రమాదం తర్వాత అలా ఒక ఇంట్లోనే ఉంటుంది ఎంతో ఇబ్బంది పడుతుంది కానీ కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లకపోవడం అనేది అంత సఖ్యతగా ఉన్నట్టు అనిపించదు. అలాగే దానికి చివరిలో ఇచ్చిన వివరణ కూడా కొంచెం బలహీనంగానే ఉంటుంది. సో వీటి పరంగా బలమైన కథనం డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఈ ఎపిసోడ్ లో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా చాలా క్లీన్ గా ఉంది. సాయి మధుకర్ ఇచ్చిన సంగీతం బాగుంది. ఎమోషన్స్ కి మరింత ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి. మాటలు బాగున్నాయి.
ఇక దర్శకుడు వరా ముళ్ళపూడి విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథని డెఫినెట్ గా ఎమోషనల్ పరంగా చాలా బాగా తెరకెక్కించారు. ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ తో ప్రెజెంట్ జెనరేషన్ చూడాల్సిన భార్యా భర్తలు ఇద్దరూ ఒకటే అనే కథని తెరకెక్కించడం హర్షణీయం. కాకపోతే లాజికల్ గా కూడా ఈ లఘు చిత్రం బలంగా ఉండి ఉంటే బాగుండేది. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మౌనమే నీ భాష” లఘు చిత్రం బలమైన ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. తల్లిదండ్రుల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులనే అద్దం పట్టేలా ఇందులో చూపించారు. అంతే కాకుండా భార్యా భర్తలు ఇద్దరూ ఒకటే అనే ఎమోషన్ ఈ లఘు చిత్రంలో వర్కౌట్ అయ్యింది. రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్ లు తమ పాత్రల్లో జీవించారు. అయితే లాజికల్ గా కొన్ని మూమెంట్స్ పక్కన పెడితే ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్ మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team