బాలీవుడ్లో సంచలనాలు సృష్టించబోతున్న తెలుగు సినిమా


టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’ హిందీ వెర్షన్ ‘మక్కీ’ పేరుతో అక్టోబర్ 12న విడుదల బాలీవుడ్లో సంచలనాలు సృష్టించడానికి సిద్దమవుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ వర్గాల నుండి మంచి స్పందన లబిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలకు విమర్శకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. తెలుగు డబ్బింగ్ సినిమాలంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ ఈ సినిమా కోసం మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్కడి ప్రేక్షకులే కాకుండా, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటులు చాలా మంది పబ్లిక్ గా ఈ చిత్రానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు.

బాలీవుడ్ సీనియర్ ట్రేడ్ పండితుడైన తరణ్ ఆదర్శ్ ‘ఈగ’ తెలుగులో విడుదలైనప్పుడు చూసి, సినిమాని చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ అనే సరికి చాలా మంది ఈ సినిమాని చూసి మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్లో చాలా మందికి తెలిసిన రాజీవ్ మసంద్ అనే విమర్శకుడు ఈ సినిమా చూసి ‘చివరికి ఈగ చూసాను, ఇంత ఫుల్ కామెడీ ఉన్న సినిమా చూసి ఎన్ని రోజులైందో గుర్తు లేదు. సినిమా అనేది యునివర్శల్ అనేది ఈ చిత్రం రుజువు చేసింది. ఎంతో వినూత్నంగా మరియు బాగా ఊహించి తీసిన సినిమా అని’ ట్వీట్ చేసారు.

బాలీవుడ్ క్రేజీ జంట అయిన అజయ్ దేవగన్ మరియు కాజోల్ తమ వాయిస్ ను ఈ చిత్రానికి అందించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున హిందీలో విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద సంచలనాలు సృష్టించి మన తెలుగు వారిని గర్వపడేలా చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

Exit mobile version