ఆగిన చోటే రీస్టార్ట్ చేయనున్న బన్నీ

ఆగిన చోటే రీస్టార్ట్ చేయనున్న బన్నీ

Published on Dec 24, 2020 2:00 AM IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఆలా వైకుంఠపురములో’ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడం, ‘రంగస్థలం’ లాంటి భారీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో హైప్ పెరిగిపోయింది. సినిమా ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోవిడ్ రూపంలో చిత్రీకరణకు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. లాక్ డౌన్ అనంతరం పక్కాగా ప్లాన్ చేసుకుని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ మొదలుపెట్టారు.

కానీ కొన్నిరోజుల చిత్ర బృందంలో కొందరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆ షెడ్యూల్ మధ్యలోనే ఆపేసి అందరూ హైదరాబాద్ తిరిగొచ్చారు. పఠాన్ చెరువులో ప్రత్యేకమైన ఫారెస్ట్ సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. అక్కడ షూటింగ్ ముగియడంతో చిత్ర బృందం మళ్ళీ మారేడుమిల్లి అడవుల మీద దృష్టి పెట్టింది. ఎక్కడైతే షెడ్యూల్ ఆగిందో అక్కడే అదే షెడ్యూల్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జనవరి ఆరంభంలో టీమ్ అక్కడకు చేరుకొందట. అయితే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత తక్కువమంది సిబ్బందితో పనిచేయనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు