ఇళయరాజాను స్టూడియోలోకి అనుమతిస్తామన్న యాజమాన్యం

ఇళయరాజాను స్టూడియోలోకి అనుమతిస్తామన్న యాజమాన్యం

Published on Dec 22, 2020 9:33 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యానికి మధ్యలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం ప్రత్యేకమైన ఛాంబర్ ఉంది. అందులోనే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. ఈ ఛాంబర్ విషయం మీదే ఇరు వర్గాల నడుమ కోర్టు కేసు నడుస్తోంది. చాలా ఏళ్ల క్రితం ప్రసాద్ స్టూడియోస్ అదిఎంత ఎల్వీ ప్రసాద్ తన స్టూడియోలోని ఒక ఛాంబర్ వాడుకోమని ఇళయరాజాకు ఇచ్చేశారు. ఇది ఇద్దరి నడుమ 40 ఏళ్ల క్రితం జరిగిన మాట ఒప్పందం. దీనికి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు.

40 ఏళ్లుగా ఇళయరాజా అక్కడే మ్యూజిక్ కంపొజిషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఎల్వీ ప్రసాద్ వారసులు మాత్రం ఇళయరాజా ఆ ఛాంబర్ వాడుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని తెలిపారు. దీంతో ఇళయరాజా కోర్టుకు వెళ్లారు. ఛాంబర్ ఖాళీ చేయమని ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం అనడాన్ని సవాల్ చేశారు. తనకు ఛాంబర్ మీద హక్కు అవసరంలేదని కేవలం అందులో ఉన్న తన ప్రాపర్టీలను మాత్రమే వాడుకుంటానని ఆయన అంటున్నారు. ఈరోజు కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం ఇళయరాజా ఛాంబర్లోకి రావడానికి అనుమతులిస్తున్నట్టు తెలిపారు. అంతేకానీ మ్యూజిక్ కంపొజిషన్స్ చేయాలనుకుంటే మాత్రం కుదరదని కండిషన్ పెట్టారు. మరి దీనికి ఇళయరాజా ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ఇళయరాజా చెన్నైలో ప్రత్యేకంగా కొత్త రికార్డింగ్ స్టూడియోను నిర్మించుకుంటున్నారు.

తాజా వార్తలు