విడుదల తేదీ : అక్టోబర్ 17, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి తదితరులు.
దర్శకుడు : కీర్తిశ్వరన్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
సంగీత దర్శకుడు : సాయి అభ్యాంకర్
సినిమాటోగ్రాఫర్ : నికేత్ బొమ్మి
ఎడిటర్ :భరత్ విక్రమన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా ‘డ్యూడ్’. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.
కథ :
గగన్ (ప్రదీప్ రంగనాథన్) లవ్ లో ఫెయిల్ అవుతాడు. కుందన (మమితా బైజు)… పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. గగన్ కి మరదలు. ఐతే, తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. మరదలి పై గగన్ మనసులో ప్రేమ పడుతుంది. నేరుగా వెళ్లి మావయ్యకి చెబుతాడు. సంతోషంగా వారి పెళ్లి చేయడానికి ఆదికేశవులు సిద్ధం అవుతాడు. ఆ తర్వాత గగన్, కుందన పెళ్లి అవుతుంది. మరి ఈ మధ్యలో వీరి పెళ్లికి వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి ?, మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది ?, ఇంతకీ.. పెళ్లి తర్వాత ఏమైంది ?, ఆ తర్వాత గగన్ ఎటువంటి త్యాగం చేశాడు ? పార్ధు (హృదూ హరూన్) ఎవరు ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
లవ్ టుడే, డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ ప్రదీప్ రంగనాథన్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రదీప్ రంగనాథన్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా మమితా బైజు తన నటనతో అలరించింది.
ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన శరత్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరో హీరోయిన్ గా కనిపించిన నేహా శెట్టి నటన కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన రోహిణి, సత్య మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు కీర్తిశ్వరన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా శరత్ కుమార్ నటన ఆ క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. హృదూ హరూన్ క్యారెక్టర్ కూడా బాగా రిజిస్టర్ అవుతుంది. మొత్తానికి సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ప్రదీప్ రంగనాథన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు కీర్తిశ్వరన్, అంతే స్థాయిలో హీరోయిన్ పాత్రను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే, కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కీర్తిశ్వరన్ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా నికేత్ బొమ్మి చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ భరత్ విక్రమన్ తగ్గించాల్సింది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘డ్యూడ్’ అంటూ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుల నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team