పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నెల చివరి కల్లా ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తవుతుంది. టాకీ పార్ట్ పూర్తయిన తరవాత ఈ చిత్రంలోని మూడు పాటలను సెప్టెంబర్లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరియు చిత్రీకరణ ఏక కాలంలో జరుగుతున్నాయి.
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ముందుగా అక్టోబర్ 18న విడుదల చేయాలనుకున్నారు కానీ అనుకున్న దాని కంటే వేగంగా చిత్రీకరణ పూర్తవడంతో ఈ చిత్రాన్ని వారం ముందే అంటే అక్టోబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.