ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ నుండి కొద్దిగా బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయపరమైన పనులను చక్కబెట్టుకుంటున్నారు. రెండు రోజుల పాటు మంగళగిరి టూర్ ప్లాన్ చేసుకున్న ఆయన ఈరోజు పలు జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈలోపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కార్యకర్తలతో చర్చలు జరిపిన ఆయన ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడ ఇచ్చారు.
చాలా రోజుల నుండి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తల నుండి, అభిమానుల నుండి ఆయనకు విజ్ఞప్తులు అందాయి. ఈమేరకు మొదట ఎన్నికలకు పార్టీ కమిటీలు వేసిన ఆయన ఎక్కువమంది పోటీచేస్తేనే బాగుంటుందని తెలపడంతో పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. ఈమేరకు ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు సూచించారు. పవన్ కు హైదరాబాద్ నగరంలో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆయన పార్టీని ఎన్నికల్లో నిలపడంతో అభిమానుల్లో జోష్ నెలకొంది.
అంటే త్వరలో జరగనున్న వారం రోజుల ప్రచారంలో కూడ పవన్ పాల్గొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ వారంపాటు ఆయన సినిమా షూటింగ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే పోలింగ్, కౌంటింగ్ అంటూ డిసెంబర్ 4 వరకు హడావిడి ఉంటుంది. కాబట్టి పవన్ సినిమా షూటింగ్లు ముందుగా ప్లాన్ చేసుకున్న దానికంటే ఒక పది పన్నెండు రోజులు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్నమాట.