మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ స్వయం సమృద్ధి సాధించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో భాగంగా, మహిళలు తయారుచేసిన వస్తువుల విక్రయానికి వీలుగా ఏర్పాటు చేసిన ‘స్త్రీ శక్తి హస్తకళా స్టోర్’ ను ఆమె ప్రారంభించారు. ఈ స్టోర్ ద్వారా సిల్క్ థ్రెడ్ గాజులు, జూట్ సంచులు వంటి వివిధ రకాల ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రతి రోజూ మహిళా దినోత్సవమేనని అన్నారు. శిక్షణ పొందిన మహిళలు తమ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడానికి, వారి ఆదాయాన్ని వారే వినియోగించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు పుష్కార్ట్లు, టైలరింగ్ మెషీన్లు వంటి వాటిని అందజేసినట్లు తెలిపారు. తాను కూడా గృహిణిగా ఉండి కంపెనీని నిర్వహిస్తున్నానని, సునీత విలియన్స్, మేరీ కోమ్, సుధామూర్తి వంటి వారు మహిళలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ స్టోర్ ద్వారా మహిళలు జీవితంలో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు.
